Karimnagar honour killing: తెలంగాణలో మరోసారి హానర్ కిల్లింగ్ ఘటన కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని శివారంపల్లి గ్రామంలో, ప్రేమ వ్యవహారం కారణంగా తల్లిదండ్రులే తమ 16 ఏళ్ల కూతురిని హత్య చేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రెడ్డి అర్చన అనే యువతి, ఇప్పటికే వివాహితుడైన ఓ వ్యక్తితో కొంతకాలంగా మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయం తమ కుటుంబ పరువు, పెద్ద కూతురు వివాహానికి ఆటంకం అవుతుందన్న భయంతో, తల్లిదండ్రులు అతి దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నవంబర్ 14 రాత్రి అర్చనకు బలవంతంగా పురుగుమందు తాగించి, అనంతరం గొంతు నులిమి చంపినట్లు దర్యాప్తులో తేలింది. అయితే మరుసటి రోజు ఆమె కడుపునొప్పితో మృతి చెందిందంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో యువతి మెడ ఎముకకు గాయం ఉన్నట్లు తేలడంతో పోలీసులు అనుమానంతో విచారణ చేపట్టారు. చివరకు గ్రామ ఉప సర్పంచ్ ముందు తండ్రి నేరం ఒప్పుకోవడంతో నిజాలు బయటపడ్డాయి.
ఈ ఘటనపై హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ, ఇది స్పష్టమైన హానర్ కిల్లింగ్ కేసని పేర్కొన్నారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
ఈ సంఘటన మరోసారి సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ప్రేమించినందుకు, మాట్లాడినందుకు పిల్లల ప్రాణాలు తీసే స్థాయికి కుటుంబాలే దిగజారడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని, ఇలాంటి ఘటనలను కఠినంగా అరికట్టాల్సిన అవసరం ఉందని సామాజికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
