
కోడెలకు గ్రాసం కరువు.. రాజన్న చెరువు దుర్గంధం వేములవాడలో కవిత ఫైర్
వేములవాడ పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక ప్రాంతీయ, సాగునీటి, ఆలయ అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, స్వామివారికి కోడె మొక్కులు చెల్లించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జాంబవతికి సంతాన ప్రాప్తి కోసం వేములవాడకు వచ్చి కోడె మొక్కు చెల్లించిన చరిత్ర ఉందని, తాము కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోరి మొక్కు చెల్లించామని తెలిపారు. అయితే భక్తులు నిష్ఠతో సమర్పించే కోడెలకు సరైన పశుగ్రాసం, నీరు అందించకపోవడం వల్ల అవి చనిపోతున్నాయని, చనిపోయాక శాస్త్రోక్తంగా అంత్యక్రియలు కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంపీ బండి సంజయ్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
కాంక్రీట్ వద్దు.. కృష్ణశిలతోనే పునర్నిర్మాణం జరగాలి:రాజన్న ఆలయానికి రూ.250 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, కాంక్రీట్ కట్టడాలు ఎక్కువ కాలం నిలబడవని, ఆగమశాస్త్రం ప్రకారం కృష్ణశిలతో శతాబ్దాల పాటు నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏదీ? చెరువు ప్రక్షాళన చేయాలి: వేలాది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంలో పారిశుధ్యం లోపించిందని, రాజన్న చెరువు దుర్గంధంతో నిండిపోయిందని, తక్షణమే చెరువు ప్రక్షాళన, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన కూరగాయల, మాంసం మార్కెట్లను వినియోగంలోకి తీసుకురాలేదని ఆరోపించారు.
యాన్ డిపో తరలింపు – కార్మికులకు అన్యాయం: సిరిసిల్లలో ఉండాల్సిన యాన్ డిపోను వేములవాడకు తరలించడం వల్ల సిరిసిల్ల మగ్గం కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ఇది విప్ ఆది శ్రీనివాస్ రాజకీయ ఆధిపత్యమేనని విమర్శించారు.
63 వేల ఎకరాలకు సాగునీరు: కాళేశ్వరం వల్ల సిరిసిల్ల, వేములవాడకు చుక్క నీరు అందలేదని, రుద్రంగి వద్ద 0.5 టీఎంసీల రిజర్వాయర్, కాలువల పనులకు రూ.200 కోట్లు కేటాయించినా 2018 నుండి పూర్తి కాలేదని తెలిపారు. పనులు పూర్తి చేస్తే 63 వేల ఎకరాలకు నీరు అందుతుందని, ధూంపేట వద్ద వరద కాలువ నుండి లిఫ్ట్ ఏర్పాటు చేసి సనుగుల పటేల్ చెరువు, ఎర్రకుంట చెరువులను అనుసంధానిస్తే మూడు మండలాలకు మేలు జరుగుతుందని సూచించారు.

