Telangana Students Stranded in Iran, ఇరాన్‌లో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల పరిస్థితి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 2,000 మంది తెలంగాణ విద్యార్థులు ప్రస్తుతం ఇరాన్‌లో వివిధ నగరాల్లో ఉన్నారు.

హైదరాబాద్ నుంచే 900 మంది
హైదరాబాద్‌కు చెందిన దాదాపు 900 మంది విద్యార్థులు టెహ్రాన్, కుం వంటి ఇరాన్ నగరాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. పాతబస్తీ, టోలీచౌకి ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు అక్కడ ఉండటంతో వారి కుటుంబాలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇంటర్నెట్ నిలిపివేత.. సంప్రదింపులు కష్టమవుతున్నాయి
ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ ఉన్న వారితో ఫోన్‌లో మాట్లాడడం కూడా సాధ్యం కావడం లేదు. దీంతో తమ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియక కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిపివేయబడడంతో తిరిగి స్వదేశానికి రావడం కూడా అసాధ్యంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇరాన్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అక్కడి అధికారులు మరియు భారత రాయబార కార్యాలయాలు ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితి తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు. ఇరాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
