కరీంనగర్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత టి. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఉత్కంఠ నెలకొంది. పార్టీ అంతర్గత విభేదాలు పెరుగుతుండటం, ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు రావడం వల్ల ఆయన తదుపరి నిర్ణయం పై చర్చలు జోరందుకున్నాయి.

T. Jeevan Reddy, : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి, కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌తోనే నిలిచిన నిష్టావంతుడిగా గుర్తింపు పొందారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
అయితే, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత విభేదాలు మొదలయ్యాయి. తనకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చడం పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానిక రాజకీయాలు, సమావేశాల విషయంలో విభేదాలు మరింత పెరిగాయి.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గం స్వతంత్రంగా పోటీ చేసి కొన్ని కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం ఆయన ప్రభావాన్ని మరోసారి చూపించింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత ఆయన నిర్ణయం పై ఊహాగానాలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉండగా, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మరోవైపు కే. చంద్రశేఖర్ రావు, కేటీఆర్ వంటి బీఆర్ఎస్ నాయకులు కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల నేపథ్యంలో జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. అవకాశం రాకపోతే పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
త్వరలోనే జగిత్యాలలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
