
GHMC SBM Urban 2.0 : స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్ (2.0) కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగర పరిశుభ్రతను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management) విభాగంలో తాజాగా నియమితులైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (DEEలు), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (AEEలు) కోసం బుధవారం ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఒరియంటేషన్ ప్రోగ్రామ్ GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించగా, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు – 2024, వాటిలో జరిగిన తాజా సవరణలు, అలాగే ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే సవాళ్లపై ఇంజినీర్లకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
GHMC swachh bharat mission SBM Urban 2.0
ఈ కార్యక్రమానికి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అధ్యక్షత వహించారు. నగరంలో పరిశుభ్రత వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఇంజినీర్లకు సూచించారు. ఘన వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రవాణా, శాస్త్రీయంగా డంపింగ్ వంటి అంశాల్లో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కారాలు అందిస్తేనే హైదరాబాద్‌ను నిజమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దవచ్చని GHMC అధికారులు పేర్కొన్నారు.
