EHS Salary Deduction: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని ఆశించిన ఉద్యోగులకు జీతాల స్లిప్‌లు చూసిన తర్వాత షాక్ తగిలింది. ఉద్యోగుల జీతాల నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) ప్రీమియం పేరుతో 1.5 శాతం మొత్తాన్ని ప్రభుత్వం కోత విధించింది.

అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ స్కీమ్ అమలుకు అవసరమైన ప్రక్రియలు పూర్తి కాకముందే కోతలు విధించడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు కోసం అవసరమైన EHS ట్రస్ట్ ఏర్పాటు కాలేదని, మార్గదర్శకాలు విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఉద్యోగులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదని, ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకోలేదని పేర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో జీతాల నుంచి నేరుగా ప్రీమియం కోత విధించడం ఉద్యోగుల్లో అనేక సందేహాలకు దారితీసింది.
EHS Salary Deduction ఉద్యోగుల అనుమతి లేకుండానే కోతలు?
ఉద్యోగుల వాదన ప్రకారం ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా జీతాల నుంచి డబ్బులు కట్ చేసింది. తమ అనుమతి లేకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది ఉద్యోగుల జీతాల నుంచి నెలకు రూ.907 నుంచి రూ.3,750 వరకు కోత పడినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరి జీతాల నుంచీ ప్రీమియం కట్ అయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల ఆందోళన
ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా జీతాల్లో కోతలు విధించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను పారదర్శకంగా అమలు చేయాల్సిన సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో అనుమానాలు పెరుగుతున్నాయని సంఘాల నేతలు పేర్కొన్నారు.
వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే EHS అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే విధించిన కోతలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.
అంతేకాకుండా, సరైన విధానాలు అమల్లోకి రాకముందే ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై చర్చ
ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం త్వరలో దీనిపై స్పష్టత ఇస్తుందా? ఉద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అనే అంశాలపై అందరి దృష్టి నిలిచింది.
Read More: Read Today’s E-paper News in Telugu
