T-Hub government office issue: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ప్రతిష్టాత్మక T-Hub భవనాన్ని ప్రభుత్వ కార్యాలయంగా మార్చే యోచన లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా తేల్చిచెప్పారు. ఇటీవల బెగంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని T-Hubకు తరలించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలపై ఆయన వెంటనే స్పందించారు.

ఈ వార్తలపై స్టార్టప్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన T-Hubను ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రభుత్వ భవనాలకు మాత్రమే మార్చాలని, కానీ T-Hubను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని సూచించారు.
T-Hub అనేది పూర్తిగా స్టార్టప్ ఇన్క్యుబేటర్, ఇన్నోవేషన్ సెంటర్‌గా మాత్రమే కొనసాగాలని, అక్కడ ఎలాంటి ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయరాదని సీఎం తేల్చి చెప్పారు. ఇది గత ప్రభుత్వ హయాంలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం అని ఆయన గుర్తు చేశారు.
సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో, T-Hubను ప్రభుత్వ కార్యాలయంగా మార్చే ప్రణాళికను అధికారులు విరమించుకున్నారు. ఇకపై కూడా T-Hub స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే కేంద్రంగానే కొనసాగనుంది.
ఈ నిర్ణయంతో స్టార్టప్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తెలంగాణలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తోందన్న సంకేతంగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
