Chalo Secretariat: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై తెలంగాణ ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం నుంచి ఈ విద్యాసంస్థలు నిరవధిక సమ్మెను ప్రారంభించగా, ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాయి.

నవంబర్ 11న చలో సచివాలయం
ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) ఆధ్వర్యంలో నవంబర్ 11న 10 లక్షల విద్యార్థులతో “చలో సచివాలయం” (Chalo Secretariat) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇది రాష్ట్రంలో విద్యా రంగం చరిత్రలోనే అతిపెద్ద విద్యార్థి ఆందోళనగా భావిస్తున్నారు.
నవంబర్ 8న ఎల్‌బీ స్టేడియంలో భారీ నిరసన
విద్యార్థుల ఆందోళనకు ముందు, నవంబర్ 8న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సుమారు 30,000 మంది బోధనా మరియు బోధనేతర సిబ్బంది పాల్గొనే భారీ నిరసన నిర్వహించనున్నారు. వారి ప్రధాన డిమాండ్ – ప్రభుత్వం వాగ్దానం చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరడం.
రూ.10,000 కోట్ల బకాయిలలో రూ.5,000 కోట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్
ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు తెలిపారు ప్రభుత్వానికి మొత్తం రూ.10,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ, కనీసం రూ.5,000 కోట్లు తక్షణం విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం దీపావళి పండుగకు ముందే రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు పై స్పందన లేకపోవడం
కాలేజీలు సూచించిన ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం విద్యాసంస్థల్లో ఆందోళనకు కారణమైంది. దీంతో పాటు ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్ విచారణ ఆదేశించడం వల్ల కాలేజీలు తమ డిమాండ్లను మరింత బలంగా ముందుకు తెచ్చాయి.
Chalo Secretariat “ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి” కాలేజీ యాజమాన్యం
ఫాతి నాయకులు పేర్కొంటూ, “ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడకూడదు. ఇచ్చిన హామీలను గౌరవించి బకాయిలను విడుదల చేయాలి. విద్యార్థులు, సిబ్బంది సహనాన్ని ఇక పరీక్షించొద్దు” అని హెచ్చరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
