తెలంగాణ పత్రిక (APR.18) : bhu bharathi chattam. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టం మరియు నూతన ఆర్.ఓ.ఆర్ చట్టంపై గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని మాట్లాడారు.
కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు భూసంబంధిత సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ అనంతరం లబ్ధిదారుల పట్టాపాస్ పుస్తకాల్లో భూమి మ్యాపింగ్ వివరాలు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భూకమతాలకు ప్రత్యేకమైన భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

భూభారతి చట్టం రూపొందించేందుకు సీనియర్ ఉన్నతాధికారులు, న్యాయనిపుణులు చాలా కాలం కసరత్తు చేసినట్లు కలెక్టర్ వివరించారు. రైతులకు చట్టంలోని ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మండలానికి చెందిన రైతుల నుంచి భూసంబంధిత ఫిర్యాదులు స్వీకరించి వాటిపై సమీక్ష జరిపారు. కొత్త చట్టంతో తమ సమస్యలు తొలగిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు జిల్లా సమాచార పౌర సంబంధాలు మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సారధి కళాకారులు పాటల రూపంలో కళాజాత ప్రదర్శనలు నిర్వహించి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.
bhu bharathi chattam – ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల పరిశీలన
అనంతరం కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తరువాత తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, పెండింగ్ లో ఉన్న ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల జాబితాలను పరిశీలించి అధికారులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు.
గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ, సమస్యలు ఎంత త్వరగా పరిష్కరించాలో ప్రతిరోజూ సమీక్ష చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, వ్యవసాయ అధికారి సంధ్యారాణి, రైతులు, అధికారులు పాల్గొన్నారు.