

Vidhana Soudha AI Fake Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కృత్రిమ మేధస్సు (AI) ని దుర్వినియోగం చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్ర సచివాలయం అయిన విధాన సౌధ (Vidhana Soudha) పై బాంబు పేలుడు జరిగినట్లుగా తయారు చేసిన ఒక నకిలీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకు బెంగళూరు పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు బీహార్ రాష్ట్రం అరారియా జిల్లాకు చెందిన హజ్రత్ అలీ షోయబ్ (25) అని గుర్తించారు. అతను గత కొన్ని నెలలుగా బెంగళూరులో రోజువారీ కూలీగా (పైప్ ఫిట్టర్) పనిచేస్తున్నాడు . కేవలం వ్యూస్ కోసం ఇలాంటి నకిలీ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడని విచారణలో తేలింది.
Vidhana Soudha AI ఈ ఘటన ఎలా జరిగింది?
గత అక్టోబర్ 20వ తేదీన ‘jnx_king_h_g’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ చేయబడింది . ఆ వీడియోలో మొదట విధాన సౌధ భవనం బయటి దృశ్యాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా, ఆ వెంటనే భారీ పేలుడు సంభవించి భవనం ధ్వంసమైనట్లుగా AI విజువల్ ఎఫెక్ట్స్ వాడి సృష్టించారు .
ఆ వీడియోకు “విధానసభను బాంబుతో ఎగరగొట్టేశాను” (Vidhanasabha uda diya bam se) అని క్యాప్షన్ కూడా పెట్టాడు . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు వెంటనే బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

పోలీసుల కీలక చర్య
సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ ఈ వీడియోను గుర్తించగానే, విధాన సౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) లాగ్స్ మరియు డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడు హజ్రత్ అలీని పట్టుకున్నారు . అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలకు సంబంధించినది .
పోలీసులు స్పష్టం చేసిన ప్రకారం, విధాన సౌధ వద్ద అసలు ఎలాంటి పేలుడు జరగలేదు. ఇది పూర్తిగా నకిలీ వీడియో . ప్రస్తుతం పోలీసులు అతని ఉద్దేశ్యం ఏమిటి, ఈ వీడియో తయారీలో మరెవరైనా సహాయపడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు .
AI నకిలీ వీడియోల ప్రమాదం
ఈ ఘటన సాంకేతికత యొక్క ప్రమాదకరమైన పక్షాన్ని చూపిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలో ఎన్నో AI ఆధారిత నకిలీ వీడియోలు (Deepfakes) సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి వీడియోలు ప్రజలను భయపెట్టడమే కాకుండా, మతపరమైన లేదా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా తయారవుతున్నాయి.
పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రతా సంస్థలపై దాడులు లేదా బెదిరింపులను చూపించే AI-జనరేటెడ్ వీడియోలను విశ్వసనీయమైన వర్గాల నుంచి ధృవీకరించుకోకుండా నిజమని నమ్మవద్దని సూచించారు . తప్పుడు సమాచారాన్ని సృష్టించి, పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
