
TELANGANA PATRIKA(MAY28) , కామారెడ్డి పట్టణంలో విద్యాశాఖ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయికృష్ణ డిమాండ్ చేశారు.
జిల్లా డీఈవోకు వినతిపత్రం సమర్పణ
బుధవారం రోజు ఆయన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. రాజును కలిసి ఈ విషయంపై వినతిపత్రం సమర్పించారు. “కామారెడ్డి పట్టణ కేంద్రంలో అనుమతులు లేని పాఠశాలలు ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తూ తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి,” అన్నారు.
విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో!..అనుమతుల లేని పాఠశాలల జాబితా
22/05/2025న జిల్లా డీఈవో కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, శ్లోక బ్రాంచ్-2, రోజ్‌వుడ్ ఛాంపియన్, విఐపి యూనివర్సల్ స్కూల్, ప్రెసిడెన్సీయల్ స్కూల్, నారాయణ స్కూల్, ఆరంభ స్కూల్, వివేకానంద బీ టాపర్స్ స్కూల్ వంటి పాఠశాలలకు ఎటువంటి అధికారిక అనుమతులు లేవని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం..
ఈ పాఠశాలలు కరపత్రాల ద్వారా తల్లిదండ్రులకు “అన్ని అనుమతులు ఉన్నాయి” అనే అసత్య ప్రచారం చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ పరిస్థితిని తక్షణమే ఎదుర్కోవాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అన్ని ఆధారాలతో నివేదిస్తామని వడ్ల సాయికృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu
