Telangana municipal elections: తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా స్థానిక సంస్థల పాలక మండళ్ల కాలపరిమితి ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Telangana municipal elections 2026
రిజర్వేషన్లపై అధ్యయనం చేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, 16న రంజాన్, ఆ తరువాత వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
మెదారంలో నిర్వహించిన 27వ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కూడా కీలకంగా చర్చ జరిగింది. ఎల్ అండ్ టీ మెట్రో నుంచి హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకునే అంశంపై తదుపరి కేబినెట్ సమావేశంలో మరింత చర్చించేందుకు ఫైళ్లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇదే సమావేశంలో మెట్రో ఫేజ్-2 (A & B) భూసేకరణకు రూ. 2,787 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే, హైదరాబాద్ ICCC నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ వరకు 9 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
మరో ముఖ్యమైన నిర్ణయంగా 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని చారిత్రక ఆలయాల అభివృద్ధితో పాటు, ఎకో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ పనులపై అధ్యయనం చేసేందుకు ఒక కన్సల్టెంట్ను నియమించగా, శాశ్వత అభివృద్ధి చర్యల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. మార్చి 31లోగా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇవే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర రంగ పరిశ్రమలకు భూకేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఊతమివ్వనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu
