Telangana Jagruthi Party: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా కొత్త అడుగులు వేయనున్నారా అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు ఆమె సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటీవల హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు ఉన్న ప్రశాంత్ కిషోర్‌తో (Prashanth Kishore)కవిత పలుమార్లు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో తెలంగాణలో కొత్త పార్టీకి ఉన్న రాజకీయ అవకాశాలు, ప్రజల్లో స్పందన, భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
Telangana Jagruthi Party kavitha
ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థకు అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అనంతరం, అదే వేదికగా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు.
2025 సెప్టెంబర్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆరోపిస్తూ, తన బంధువులు హరీష్ రావు, సంతోష్ కుమార్‌పై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ తర్వాత కవిత శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఇటీవల కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ రాజీనామాను ఆమోదించారు.
ఇదే సమయంలో కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అవినీతి ఆరోపణలు చేస్తూ, 2014 నుంచి జరిగిన అన్యాయాలపై ఒక రోజు తానే విచారణ చేపడతానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి అవుతానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ వేదిక పోటీ చేస్తుందని కూడా వెల్లడించారు.
ఇటీవల మరోసారి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన కవిత, బీఆర్ఎస్ రాజ్యాంగం హాస్యాస్పదమని, గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని ప్రజాద్రోహ నిర్ణయాలకు తాను బాధ్యత వహించలేదని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌తో కవిత చర్చలు నిజమైతే, తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
