
TELANGANA PATRIKA (MAY18) , తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం జూన్ 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి కార్యక్రమ షెడ్యూల్ ప్రకటించారు. దీనితోపాటు బడిబాట మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ నాటికి పాఠశాలల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం పునఃప్రారంభం అయ్యే జూన్ 12వ తేదీన పాఠశాలలను అలంకరించాలని సూచించారు. పండగ వాతావరణంలో తల్లిదండ్రులకు, గ్రామస్థులకు స్వాగతం పలకాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశం (పీటీఎం) నిర్వహించాలని ఆదేశించారు.
రోజు వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు…,
జూన్ 6న: స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామసభ నిర్వహించాలి.
7న: ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాలి.
8, 9, 10 తేదీల్లో: కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన చేపట్టాలి. మధ్యలో బడి మాని వేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించాలి. వారిని అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
11న: జూన్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.
12న: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలి. అదే రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందించాలి.
13న: ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులను ఆహ్వానించి వారి సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం, బాల సభ నిర్వహించాలి.
16న: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్(లిప్) దినోత్సవం జరపాలి. అన్ని తరగతి గదుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యసన సామర్థ్యాలకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించాలి. పిల్లలు రూపొందించిన వివిధ ఛార్టులతో గదులను అలంకరించాలి. చదవడం, గణిత సంబంధిత అంశాలపై ఎఫ్‌ఎల్‌ఎన్ క్విజ్ పోటీలు నిర్వహించాలి.
17న: సమీకృత విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించాలి. బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలి.
18న: తల్లిదండ్రులను, గ్రామస్థులను ఆహ్వానించి తరగతి గదుల డిజిటలీకరణ, ఇతర ఆధునిక సౌకర్యాలను చూపించాలి. మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.
19న: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించాలి.
Also Read : హైకోర్టు జడ్జితో కలెక్టర్ భేటీ..!
Comments are closed.