KTR Revanth Reddy , భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి “ATM”గా మార్చారని ఆయన ఆరోపించారు.

రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్ల ఆఫర్ చేశారన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ సంపద కాంగ్రెస్ నాయకత్వానికి తరలించబడుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు.
రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బుల్లేవని చెప్పే ప్రభుత్వం, మరోవైపు భారీగా అప్పులు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రెండు సంవత్సరాల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ అభివృద్ధిలో ఎలాంటి పురోగతి కనిపించలేదని అన్నారు.
మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు, గిరిజనుల భూములు, యూనివర్సిటీ భూములను ఆక్రమిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. HILT పాలసీ పేరుతో పరిశ్రమల భూములను దోచుకుంటున్నారని కూడా విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం ప్రజల డబ్బును దోచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడమేనని కేటీఆర్ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
