
TELANGANA PATRIKA(JUN 1) , వేములవాడలో కోడెల పంపిణీ, సంరక్షణపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో ఉంచిన 32 జతల కోడె పిల్లలను (మొత్తం 64) అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిప్పాపూర్ గ్రామంలో గోశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ, కోడె పిల్లలను పొందిన రైతులు వాటి సంరక్షణపై పూర్తి బాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెరుగైన దాణా – వైద్య శిబిరాలు
జీవాలకు మంచి దాణా, పచ్చిగడ్డి అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. గోశాల పరిసరాల్లో లోతైన ప్రదేశాలను చదును చేసి, జీవుల నివాసానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నారు. పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాధాభాయి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహశీల్దార్ విజయ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.