Telanganapatrika (August 21): కమెడియన్ రామచంద్ర, ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. ప్రతి రోజు వందలాది మంది కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొందరికి అదృష్టం కలిసొచ్చి స్టార్‌డమ్ వస్తే, మరికొందరికి అయితే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి.

స్టేజ్ మీద స్టార్.. నిజ జీవితంలో కష్టాల్లో కమెడియన్ రామచంద్ర
అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న నటుల్లో ఒకరు కమెడియన్ రామచంద్ర. అనేక సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సొంతం, వెంకీ వంటి సినిమాలలో ఆయన చేసిన పాత్రలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ అందుకోలేకపోయాడు.

ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయినా, ఆయన ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా ఆయన ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బందులు తెచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు బ్రెయిన్‌లో రెండు క్లాట్స్ ఉన్నాయని, పక్షవాతం కారణంగా ఎడమ చేయి, కాలుకు సమస్యలు ఉన్నాయని చెప్పారు.
రామచంద్ర గతంలో మరో ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ “నిన్ను చూడాలని తో మొదటి అవకాశం దొరికింది. తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి. కానీ ఒక రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత మూడేళ్లు గ్యాప్ వచ్చింది. అప్పటికే డబ్బులు అయిపోయాయి. అప్పుల పాలు అయ్యాను. నిర్మాతల దగ్గరకు వెళ్తే ‘ఎవరు నువ్వు? గుర్తులేదు’ అని చెప్పడం చాలా బాధించింది” అన్నారు.
ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఎవరైనా సాయం చేయాలని కాదు, కేవలం మళ్ళీ నటనకు అవకాశం రావాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పారు.
Read More: Read Today’s E-paper News in Telugu