Telanganapatrika (August 03) : Rural Employment – హిమ్మత్ నగర్ గ్రామస్థులు ఇసుక క్వారీలలో ఉపాధి కోసం దీక్షలు చేపట్టారు. ఆర్డీవో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

హిమ్మత్ నగర్ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆర్డీవో రమేష్ బాబు..
హిమ్మత్ నగర్ గ్రామంలో ఇసుక క్వారీలలో ఉపాధి నిమిత్తం గ్రామస్తులు చేపట్టిన, సామూహిక రిలే నిరాహార దీక్షలు 24 రోజులకు చేరుకున్నాయి. శనివారం జిల్లా కలెక్టర్ సూచన మేరకు దీక్ష శిబిరాన్ని హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, మండల తహసిల్దార్ రజిత సందర్శించి, నిరాహార దీక్ష చేపట్టిన గ్రామస్తులతో చర్చించారు. హిమ్మత్ నగర్ గ్రామస్తులు డిమాండ్లను కులంకషంగా ఆర్డీవోకు వివరించారు. హిమ్మత్ నగర్ గ్రామం కొండపాక రెవెన్యూ గ్రామ పరిధిలో ఉందని, ఇసుక క్వారీలలో లారీలకు పరదాలు కప్పేందుకు, మా గ్రామస్తులకు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదాయాన్ని మా గ్రామానికి కూడా ఇవ్వాలని, ఇసుక క్వారీలలో మా గ్రామానికి వాటా కల్పించాలని గ్రామస్తులు కోరారు. అనంతరం ఆర్డీవో గ్రామస్తుల డిమాండ్లను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, సమస్య పరిష్కార దిశగా మా వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.