TELANGANA PATRIKA (MAY 6) , Food Safety Task Force Raids: వరంగల్ జిల్లా గొర్రెకుంటలో ఉన్న బెల్ బ్రాండ్‌కు చెందిన శ్రీ భవాని స్వీట్స్ కారా తయారీ కేంద్రం పై తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాల మేరకు జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి నేతృత్వంలో జరిగాయి.

Food Safety Task Force Raids అపరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం
తనిఖీల్లో అధికారులు పరిశీలించగా, కారా తయారీ ప్రాంతం అసహ్యకరంగా ఉండడం, ఫుడ్ హ్యాండ్లర్స్ తగిన పరిశుభ్రత పాటించకపోవడం, హెయిర్ క్యాప్స్, గ్లౌజ్‌లు లేకపోవడం వంటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. తుప్పు పట్టిన యంత్రాలను ఉపయోగించడం, గోడలు, పైకప్పులో బూజు ఉండటం లాంటి సమస్యలు బయటపడ్డాయి.
కాలం చెల్లిన పదార్థాలు సీజ్
పరిశీలనలో సుమారు రూ. 2.4 లక్షల విలువైన 1800 కిలోల కాలం చెల్లిన శనగపప్పు, రూ. 1.5 లక్షల విలువైన లేబుల్ డిఫెక్ట్ కన్ఫెక్షనరీ పదార్థాలు గుర్తించబడ్డాయి. వీటిని తక్షణమే FSS Act, 2006 ప్రకారం సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు. అనుమానిత శాంపిలులను ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజారోగ్యం కోసం కఠిన చర్యలు
ఈ సందర్భంగా వి. జ్యోతిర్మయి మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే తయారీదారులు ఆహార భద్రత ప్రమాణాలను పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి, తయారీ కేంద్రాలను సీజ్ చేస్తామని కూడా తెలిపారు.
వ్యాపారులకు సూచనలు
ఆహార ఉత్పత్తి, నిల్వ, రవాణా, విక్రయాలలో పాల్గొనే వ్యాపారులు కల్తీ మరియు అపరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు
Also Read: Manu Chowdary IAS: బస్వాపూర్ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

Comments are closed.