Kolagani Srinivas mayor: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నూతనంగా ఎన్నికైన మేయర్ కొలగాని శ్రీనివాస్ (37) సామాజిక సేవా కార్యక్రమాలు మరియు గ్రామస్థాయి రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

1989 జూన్‌లో కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ పీజీ డిగ్రీలు పూర్తి చేశారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలతో అనుబంధం కొనసాగిస్తూ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నారు. 2013లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు.
స్వామి వివేకానంద బోధనల ప్రభావంతో యువత అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS), నెహ్రూ యువ కేంద్ర వంటి వేదికల ద్వారా యువజన సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేశారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. 2005 నుంచి 2007 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో పని చేస్తూ విద్యార్థి సమస్యలపై పోరాడారు. 2007 నుంచి 2009 వరకు భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో యువజన సమీకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2007-2009 మధ్య NSS వాలంటీర్‌గా సేవలందించిన ఆయన 2010లో ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. 2009లో అసోంలో జరిగిన జాతీయ ఐక్యత మరియు శాంతి శిబిరంలో పాల్గొన్నారు. లక్షద్వీప్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన జాతీయ శిబిరాల్లో కూడా పాల్గొన్నారు.
2009 నుంచి 2013 వరకు ఏక్తా పరిషత్‌తో అనుబంధంగా గిరిజన హక్కుల అంశాలపై పని చేశారు. సేవలకు గుర్తింపుగా 2005లో భాయ్‌జీ సేవా పురస్కార్, 2010లో NSS ఉత్తమ వాలంటీర్ అవార్డు అందుకున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర మంత్రిచే ‘రక్షక్ అవార్డు’ అందుకున్నారు.
రాజకీయ జీవితంలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుంచి 2025 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 1వ డివిజన్ కార్పొరేటర్‌గా సేవలందించారు. 2021లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2023-24లో కరీంనగర్ టౌన్-1 కన్వీనర్‌గా, 2024లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2025లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై, ప్రస్తుతం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

