Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. హై వోల్టేజ్ ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు భారీ ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.

ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Telangana Municipal Elections 2026
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రజాసభల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, పలువురు ఎంపీలు ప్రచార సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు. అన్ని పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాయి.
ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో జరగనున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డులు కలిపి మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.62 లక్షల మంది పురుష ఓటర్లు ఉండటం విశేషం.
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూములు, 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ఎన్నికైన వార్డు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
