Medaram Sammakka Saralamma Jatara: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ మహాజాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రులు అద్లూరి లక్ష్మణ్ కుమార్, ధనసరి సీతక్క వెల్లడించారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో వారు ఈ విషయాలను తెలిపారు.
మహాజాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిందని మంత్రులు చెప్పారు. కుంభమేళాను మించిపోయే స్థాయిలో ఈ జాతరను నిర్వహించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
- శాశ్వత నిర్మాణాలు
- రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి
- భద్రత, ట్రాఫిక్ నియంత్రణ
- రవాణా సౌకర్యాలు
- తాగునీరు, మరుగుదొడ్లు
- వైద్య సేవలు
Medaram Sammakka Saralamma Jatara అన్నింటిపై ప్రత్యేక దృష్టి
భక్తుల రాకపోకలు సులభంగా ఉండేందుకు ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, వన్‌వే ట్రాఫిక్ విధానం, ప్రత్యేక రూట్ మ్యాపులు అమలు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు.
జాతర నిర్వహణను నిత్యం పర్యవేక్షించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా గురువారం, శుక్రవారాల్లో సుమారు 40 లక్షల మంది భక్తులు రానున్నారని అంచనా వేశారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ల వినియోగం, భక్తులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక యాప్ లేదా QR కోడ్ అభివృద్ధి చేయాలని సూచించారు.
అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. చివరగా మంత్రులు, ముఖ్య కార్యదర్శి కలిసి ప్రత్యేక లోగో, యాప్, ప్రచార వీడియోలను ఆవిష్కరించారు.
మెదారం మహాజాతరను భక్తిశ్రద్ధలతో, సురక్షితంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైందని ఈ సమావేశం స్పష్టం చేసింది.
Read More: Read Today’s E-paper News in Telugu
