Women SHG Federation Buildings: గ్రామీణ మహిళల సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ఫెడరేషన్‌ల కోసం ప్రత్యేక భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భవనాలు మహిళల స్వయం ఉపాధి, నిర్ణయాత్మక పాత్ర, గ్రామ స్థాయి నాయకత్వానికి కేంద్రాలుగా పనిచేయనున్నాయి.

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క (అనసూయ) ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామాల్లో SHGల కార్యకలాపాలకు శాశ్వత వసతి లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
Women SHG Federation Buildings ప్రతి గ్రామంలో ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ భూమిలో సుమారు 200 చదరపు గజాల విస్తీర్ణంలో, కనీసం 552 చదరపు అడుగుల నిర్మాణంతో మహిళా సంఘ భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో భవనానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. అన్ని గ్రామాల్లో ఒకే విధమైన సౌకర్యాలు ఉండేలా ప్రామాణిక డిజైన్ కూడా సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ భవనాలు మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి కార్యకలాపాలకు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు తాత్కాలిక భవనాలు లేదా ఇతరుల సౌకర్యాలపై ఆధారపడుతున్న మహిళా సంఘాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
భవనాల నిర్మాణానికి గ్రామసభలో తీర్మానం తప్పనిసరిగా ఉండాలని, అనంతరం మండల, జిల్లా స్థాయి ద్వారా ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్‌కు పంపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతాయి.
ఈ నిర్మాణాలు ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నందున, సామాజిక ఆడిట్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్మాణం పూర్తైన ఆరు నెలల్లో సామాజిక ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
గ్రామీణ మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుందని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
