Yadadri Temple Gold Saree Donation: తెలంగాణ చేనేత కళకు మరోసారి ఘనమైన గుర్తింపు లభించింది. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు నల్ల విజయ్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి బంగారు జరీతో ప్రత్యేకంగా నేసిన పట్టు చీరను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ఈ చీరను పూర్తిగా హ్యాండ్‌లూమ్‌పై నేయగా, అందులో రెండు గ్రాముల బంగారం జరీ రూపంలో వినియోగించారు. చీర పొడవు 5.30 మీటర్లు, వెడల్పు 48 ఇంచులుగా ఉండగా, తెలంగాణ సంప్రదాయ చేనేత కళకు ఇది ప్రతీకగా నిలిచింది.
మంగళవారం రోజున యాదగిరిగుట్ట ఆలయంలో జరిగిన సాధారణ కార్యక్రమంలో నల్ల విజయ్ ఈ చీరను ఆలయ ప్రధాన అర్చకులకు, సహాయ కార్యనిర్వాహక అధికారికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయన భక్తి భావాన్ని అభినందించారు.
సిరిసిల్లను చేనేత రాజధానిగా నిలబెట్టిన నల్ల విజయ్ ఇప్పటికే అధిక బంగారు జరీ వినియోగంతో వినూత్న చీరల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు యాదాద్రి స్వామివారికి చేసిన ఈ సమర్పణతో ఆయన కళకు ఆధ్యాత్మిక స్పర్శ కూడా చేరింది.
ఈ ఘటనతో తెలంగాణ చేనేత కార్మికుల ప్రతిభకు మరోసారి గౌరవం దక్కిందని, సిరిసిల్ల చేనేతకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
