
Telanganapatrika (May 18): Seethakka. మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని, జిల్లాలోని రెబ్బెన మండలంలో కొమురవెల్లి నుండి కిష్టాపూర్ వరకు చేపట్టిన రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ- శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం జిల్లాలోని రెబ్బెన మండలంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో కొమురవెల్లి నుండి కిష్టాపూర్ వరకు బి. టి. రోడ్డు నిర్మాణం కొరకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి లతో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ 10 కోట్ల రూపాయల సి ఆర్ ఆర్ నిధులను జిల్లాలో రహదారుల నిర్మాణానికి కేటాయించడం జరిగిందని, కొమురవెల్లి నుండి కిష్టాపూర్ వరకు 2 కోట్ల రూపాయల వ్యయంతో బి టి రహదారి నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎంతోకాలంగా ఈ ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యం లేక వాహనదారులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రహదారి నిర్మాణ పనులను వెంటనే చేపట్టి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో 44 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి గ్రామంలో సిసి రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు కల్పిస్తూ మండల కేంద్రానికి అనుసంధానం చేసి రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా గూడు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని గిరిజనులకు ప్రత్యేక ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
ReadMore: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: జీవితాన్ని కాపాడుకోండి| మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బి టి రహదారి నిర్మాణ పనులను వర్షాలు ప్రారంభం కాకముందే జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారును ఆదేశించారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆసిఫాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అన్ని గ్రామాలకు బిటి రహదారి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని, పనులు నాణ్యతగా చేయాలని తెలిపారు. పనులలో జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చూడాలని, ఈ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.