Telanganapatrika (జూలై 17) : Ration Shop Meeseva Inspection Orders – నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రేషన్ షాపులు, మీ-సేవా కేంద్రాల తనిఖీకి అధికారులను ఆదేశించారు.
Join WhatsApp Group
Join Now

Ration Shop Meeseva Inspection Orders.
- రేషన్ షాపులు, మీ-సేవా కేంద్రాలను తనిఖీ చేయండి
- అధికారులను ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
- నిజామాబాద్ జిల్లాలోని అన్ని రేషన్ షాపులు, మీ-సేవా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ అంశాలపై తహసిల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లకు తావులేకుండా ఉండేందుకు గాను క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాలను సందర్శించి, వాటి పనితీరును పరిశీలించాలని సూచించారు.
- అన్ని రేషన్ షాపులలో పక్కాగా నిబంధనలు అమలయ్యేలా, సక్రమంగా నిర్వహణ జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మీ-సేవా కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని, అధిక డబ్బులు వసూలు చేసే కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల నుండి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఎక్కడ కూడా ఫిర్యాదులు రాకూడదని అన్నారు. కాగా, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తహసిల్దార్లను ఆదేశించారు.
- క్షేత్రస్థాయి విచారణ నిర్వహిస్తూ, పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 14వ తేదీ లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా ప్రణాళికాబద్దంగా పని చేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తుల పురోగతిని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీఓలు ప్రతిరోజూ పర్యవేక్షిస్తారని, తాను కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున, దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.
- అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలన జరపాలన్నారు. అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు కాకుండా పక్కాగా వెరిఫికేషన్ చేయాలని సూచించారు. రేషన్ కార్డుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తే, వారి కార్డులను రద్దు చేయాలని అన్నారు. అయితే అర్హులైన ఏ ఒక్కరి కార్డు కూడా రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తహసిల్దార్లు స్వయంగా పరిశీలన జరపాలని కలెక్టర్ ఆదేశించారు.
- ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు చేసుకుంటున్న లబ్దిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా జరిగేలా చొరవ చూపాలన్నారు. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సేకరించే ఇసుకకు డబ్బులు వసూలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. అదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుక పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్దిదారులపై ఇసుక చార్జీల రూపంలో అదనపు భారం పడకుండా చూడాలన్నారు. ఆయా ప్రాంతాలలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ళను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారికి కేటాయించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, హౌసింగ్ శాఖ అధికారి నివర్తి, అన్ని మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) – Click Here
తెలంగాణ కలెక్టరేట్ న్యూస్ – Click Here
తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన సమాచారం అక్కడే లభిస్తుంది.