TelanganaPatrika, ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి స్టేషన్ వాగు బ్రిడ్జి పై నుంచి నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా వాగులో నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం నీరు బ్రిడ్జి పైకి చేరడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రామ పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అంచనా వేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. వరద తగ్గే వరకు రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను ఉంచి ప్రవేశాన్ని నిషేధించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సిన వారిని ట్రాక్టర్ పై ఎక్కించి సురక్షితంగా రోడ్డు దాటించారు.
స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది. అయితే వరద మరింత పెరిగితే మరింత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.