Telanganapatrika (August 3): IT layoffs 2025 , ఇటీవల ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న ఉద్యోగ కోతలు ఉద్యోగ భద్రతపై తీవ్ర అనిశ్చితిని తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి ప్రతీకగా, లక్షలాది యువతకు ఆకాంక్షల కేంద్రమైన ఈ రంగం — ఇప్పుడు మానవ వనరులను ఖర్చుల భారం గా చూస్తున్న దిశగా మారింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రో లాంటి దిగ్గజ సంస్థలు వందలాది మధ్యస్థాయి ఉద్యోగులను ఒక్కసారిగా తొలగిస్తున్నవి. ఇది తాత్కాలిక వ్యూహంగా కాక, దీర్ఘకాలిక మార్పుల సంకేతంగా భావించాలి.

IT layoffs 2025 ఆందోళనలో ఐటీ వర్గాలు..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు విస్తృతమవుతోంది. 2024 నాటికి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కలిపి సుమారు 3 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. భారతదేశంలోనూ 2023–24 సంవత్సరాల్లో సుమారుగా 70,000 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) లెక్కలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో, విద్యార్థులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ సైన్స్, ఐటీ వంటి కోర్సుల్లో పట్టభద్రులవుతున్నా, తగిన ఉద్యోగాలు లభించక నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ప్రతి ఏడాది భారత్‌లో సుమారుగా 15 లక్షల ఇంజినీర్లు పట్టభద్రులవుతుండగా, వారిలో కేవలం 35-40 శాతం మంది మాత్రమే తక్షణ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. కంప్యూటర్ సైన్స్ మరియు ఐటీ సబ్‌స్ట్రీములకే ఇది వర్తించేది. మిగిలినవారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు లేదా తక్కువ వేతనంతో అసంబంధిత రంగాల్లో పనిచేస్తున్నారు. అంతేకాక, కొందరు విదేశాలకు వెళ్లే మార్గాన్ని అన్వేషించాల్సి వస్తోంది.
IT layoffs 2025 మారుతున్న వ్యాపార నమూనాలు వేగంగా ఎదుగుతున్న కృత్రిమ మేధస్సు (AI)
ఈ పరిణామాలకు ప్రధాన కారణాలు — మారుతున్న వ్యాపార నమూనాలు, ఖర్చుల నియంత్రణపై ఒత్తిడి, ఆటోమేషన్, డిజిటలైజేషన్, మరియు అత్యంత ప్రభావవంతంగా ఎదుగుతున్న కృత్రిమ మేధస్సు . సంస్థలు వేగంగా మారుతున్న టెక్నాలజీని అవలంబిస్తూ, మానవశక్తికి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, అనుభవజ్ఞులైన ఉద్యోగులే ఎక్కువగా ‘ఖర్చుతో కూడిన వనరులు’గా భావించబడుతున్నారు.
భారతదేశంలో ఉద్యోగం కోల్పోవడం కేవలం వ్యక్తిగత నష్టం కాదు. అది కుటుంబ స్థిరత, పిల్లల భవిష్యత్తు, సామాజిక భద్రతపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మధ్యతరగతి కుటుంబాలకైతే ఉద్యోగం ఒక ప్రధాన ఆధారం. ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే, ఆర్థిక ఇబ్బందులతోపాటు మానసిక ఒత్తిడికి లోనవ్వడం సాధారణమే.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు తాము మారుతున్న వాస్తవాలను అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఒకే సంస్థలో దశాబ్దాల పాటు ఉండే యుగం ముగిసింది. శాశ్వత విద్యాభ్యాసం, నూతన నైపుణ్యాల అభ్యాసం ఇప్పుడు అవసరం కాదు — అవసరమైన జీవన నైపుణ్యం. డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం వాస్తవ ప్రపంచం ఎదుర్కొంటున్న మలుపులకు సమాధానం.
అయితే సంస్థల వైఖరి కూడా ప్రశ్నార్థకమే. తక్షణ లాభాల కోసం మానవ వనరులను త్యజించడం, మానవీయత లేకుండా వ్యవహరించడం తీవ్రంగా విమర్శించదగినది. భారత్‌లో బలమైన ఉద్యోగ భద్రతా వ్యవస్థలు లేకపోవడంతో, ఉద్యోగ కోల్పోయిన వారికి సరైన పరిహారం, పునర్వినియోగ అవకాశాలు లభించడం లేదు. కనీసం ముందస్తు హెచ్చరికలు, నైపుణ్య శిక్షణ, తిరిగి నియామక అవకాశాలు వంటి మద్దతు చర్యలు తీసుకోవడం సంస్థల నైతిక బాధ్యతగా మారాలి.
IT layoffs 2025 సాఫ్ట్‌వేర్ రంగం సంక్షోభంలో – పరిష్కారం ఏంటి?
ఇక ప్రభుత్వపాత్ర మరింత కీలకం. ఉద్యోగం కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం, పిల్లల విద్యా సహాయం, ఆరోగ్య బీమా వంటి భద్రతా నెరవేర్చే విధానాలను అమలు చేయాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగ సంస్థలతో భాగస్వామ్యంగా ఉపాధి శిక్షణ, స్కిల్లింగ్ కేంద్రాల ద్వారా పునరావృత్తి అవకాశాలను పెంపొందించాలి.
మొత్తానికి — టెక్నాలజీ అభివృద్ధి, కృత్రిమ మేధస్సు వృద్ధితో ఉద్యోగాల స్వభావం మారుతోంది. కానీ ఈ మార్పులు సమాజాన్ని అస్థిరత వైపు నెట్టి, మధ్యతరగతిని సంక్షోభంలోకి నెత్తితే అభివృద్ధి లక్ష్యాలన్నీ గాలికొదిలినట్లవుతాయి. అందువల్ల సంస్థలు, ప్రభుత్వాలు, ఉద్యోగులు — ఈ ముగ్గురు ఒకే దిశగా నడవాలి. ఉద్యోగ భద్రత కేవలం వ్యక్తిగత సమస్య కాదు — అది సమాజ ఆర్థిక స్థిరత్వానికి ఆధారస్తంభం.
Author : సి.హెచ్. ప్రతాప్
Read More: Read Today’s E-paper News in Telugu