Telanganapatrika (June 8): Adluri Laxman Kumar, కాంగ్రెస్ పార్టీలో1986 లో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఎదిగి సోమవారం రాష్ట్ర గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటే ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం క్యాబినెట్ విస్తరణ జరిపిన నేపథ్యంలో రాష్ట్రం మంత్రివర్గంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, సీనియర్ కాంగ్రెస్ నేత, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది. సోమవారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ చే మంత్రిగా లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు.విద్యార్థి దశలో 1986-1994 ఎన్ ఎస్ యు ఐ నాయకుడిగా, 1996 -2001వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన లక్ష్మణ్ కుమార్ 2006లో ధర్మారం జెడ్పీటీసీ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ గా, ఉమ్మడి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2009 నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.

Adluri Laxman Kumar: 2014 స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను ఓటమి అంచుల వరకు తీసుకువెళ్లి విజయం సాధించినా,నాటి అధికార ప్రభుత్వ ఒత్తిడికి అధికార యంత్రాంగం సాంకేతిక తదితర కారణాలు చూపెడితే లక్ష్మణ్ కుమార్ ఓడినట్టు ప్రకటించారు. తమ ఓటమిని సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ఈవీఏంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి ఆదేశించింది.నాటి ప్రభుత్వ యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ తాళం కీ లేవు అనడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు అందులో ఉండాల్సిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో అప్పటి కలెక్టర్ ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధి ఈ సంఘటనపై విచారణ జరిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి, కొప్పుల ఈశ్వర్ పై ఇరవై రెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు. లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కొనసాగుతుండగా అనూహ్యంగా రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!